: 70 సంవత్సరాలలో ఏనాడు ఇలాంటి నిరాశాపూరిత బడ్జెట్టును చూడలేదు: జైపాల్ రెడ్డి


కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నిన్న ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌పై కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... మ‌న దేశ‌ ఆర్థిక వ్యవస్థ చాలా సంక్షోభంలో ఉందని అన్నారు. 70 సంవత్సరాలలో ఏనాడు ఇలాంటి నిరాశాపూరిత బడ్జెట్ చూడలేదని ఆయ‌న విమ‌ర్శించారు. ఈ బ‌డ్జెట్లో కొత్త రైల్వే లైన్లు, కొత్త పరిశ్రమలు లేవ‌ని ఆయ‌న అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న‌ నోట్లరద్దు నిర్ణ‌యం వల్ల 6 నెలలు కష్టాలు, 3 నెలలు నష్టాలు వచ్చాయని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌ధానిమోదీ ఆలోచన లేకుండా తీసుకున్న‌ వినాశక చర్యే పెద్ద‌ నోట్లరద్దు నిర్ణ‌యం అని ఆయ‌న చెప్పారు.

పెద్ద‌నోట్ల ర‌ద్దుకు మద్దతిచ్చిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, దీని వల్ల రాష్ట్రానికి ఏం లాభం జరిగిందో చెప్పాల‌ని జైపాల్‌ రెడ్డి డిమాండ్ చేశారు. పొలిటికల్ ఫండింగ్‌లో సంస్కరణలు నామమాత్రమేనని ఆయ‌న అన్నారు. పార్టీల ద్వారా నల్లధనం ప్రవహించడం లేదని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇప్ప‌టివ‌ర‌కు రూ. 20 వేలకు బినామీలను వెతుక్కున్న పార్టీలు ఇప్పుడు రూ. 2 వేలకి వెతుక్కుంటాయని ఆయ‌న అన్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న చేసిన‌ప్పుడు గాలితో నిండిన టైరులా ఉన్న మోదీ.. బడ్జెట్ తర్వాత పంక్చర్‌ అయిన టైర్ లా ఉన్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. డిమానిటైజేష‌న్ జ‌రిగిన అనంత‌రం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్.. ప్ర‌జ‌ల ఆశ‌ల‌ను నీరు గార్చిందని చెప్పారు. ఓ వైపు అంతర్జాతీయంగా చమురు ధరల తగ్గుదల వల్ల కేంద్ర ప్ర‌భుత్వానికి రూ.లక్ష కోట్లు ఆదా అవుతుంటే, మ‌రోవైపు ఈ బడ్జెట్ లో సామాన్యులకు ఊరట క‌లిగించే నిర్ణ‌యాలు తీసుకోలేద‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News