: వరకట్న వేధింపులకు అందంగా లేని యువతులే కారణమట! ... విద్యార్థులకు మహారాష్ట్ర విద్యాశాఖ బోధన!
అందంగా లేని, అంగవైకల్యం ఉన్న యువతుల కారణంగానే వరకట్న వేధింపుల సమస్యలు పెరిగిపోతున్నాయంటూ మహారాష్ట్రలోని పన్నెండో తరగతి విద్యార్థులకు బోధిస్తున్నారు. పన్నెండో తరగతి సోషియాలజీ టెక్స్ట్ బుక్ లో ‘భారత్ లో అతిపెద్ద సామాజిక సమస్యలు’ పేరిట ఓ అధ్యాయం ఉంది. అందంగా లేని, అంగవైకల్యం ఉన్న యువతులకు పెళ్లిళ్లు కాకపోవడం కారణంగానే వరకట్నాలు ఇస్తున్నారని, దీంతోనే వేధింపుల సంఖ్య పెరిగిపోతోందని ఆ అధ్యాయంలో పేర్కొన్నారు.
అలాంటి యువతుల తల్లిదండ్రులు వరుడు అడిగినంత కట్నం ఇస్తున్నారని, వరకట్న సంప్రదాయం కొనసాగుతూనే ఉందని ఆ పాఠంలో పేర్కొనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి రాతల ద్వారా విద్యార్థులను తప్పుదోవ పట్టించడం సబబు కాదని పలువురు మండిపడుతున్నారు. కాగా, ఈ విషయమై విచారణ నిర్వహిస్తామని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు చీఫ్ జీకే మమానే వివరణ ఇచ్చారు.