: ట్వీట్లు కాదు.. క్లారిటీ కావాలి: పవన్ కల్యాణ్‌కి వైసీపీ నేత సూచన
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ట్విట్టర్లో వరుసగా ట్వీట్లు చేస్తున్న జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ఆ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎందుకు ప్రశ్నించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నిలదీశారు. ప్రభుత్వ తీరుపై పవన్ కల్యాణ్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని ఆయన సూచించారు. నిన్న పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇవ్వనందుకే వారు ఈ సంబరాలు చేసుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు.
ఓటుకు నోటు కేసు అనంతరం, రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరిగినా చంద్రబాబు నాయుడు న్యాయమే జరిగినట్లుగా భావిస్తున్నారని అమర్నాథ్ విమర్శించారు. ఒకవైపు ఏపీ నష్టపోతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆనందపడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి పూర్తి కారణం ఆయనేనని ఆరోపించారు. హోదా కోసం ముందుండి పోరాడాల్సిన ముఖ్యమంత్రి వెనకుండి వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పారు. చంద్రబాబు, వెంకయ్య నాయుడుల శరీరాలు వేరైనా అవిభక్త ఆత్మలని ఆయన అన్నారు. విశాఖపట్నానికి రైల్వే జోన్ సాధన పోరాటంలో తదుపరి కార్యాచరణను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.