: ఇకపై హెడ్ పోస్టాఫీసుల్లో పాస్ పోర్టులు!
పాస్ పోర్టులను సొంత జిల్లాలోనే పొందే సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించనుంది. ఇకపై జిల్లా హెడ్ పోస్టాఫీసులు పాస్ పోర్టు కేంద్రాలుగా కూడా సేవలందించనున్నాయి. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ చర్యలు చేపడుతోంది. తమ సేవలను మరింత విస్తృతం చేయనున్నామని, వీటిని అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా తపాలాశాఖలో కూడా పాస్ పోర్టు సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని అధికారులు తెలిపారు. కాగా, విదేశీ వ్యవహారాల శాఖ మరో శాఖతో కలిసి పని చేయడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు.
అంతే కాకుండా రక్షణశాఖ కూడా పెన్షనర్ల సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టింది. దీంతో వెబ్ ఆధారిత పింఛను పంపిణీ వ్యవస్థను కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వ్యవస్థ ద్వారా రక్షణ శాఖలో విధులు నిర్వర్తించిన ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలు స్వీకరించడం, అనంతరం చెల్లింపులు చేయడం నిర్వహించనున్నారు. ఇప్పటికే సైనికులు, సైనికాధికారుల కోసం డిఫెన్స్ ట్రావెల్ సిస్టం అందుబాటులో ఉండగా, ప్రయాణ టికెట్ల బుకింగ్ లో వారు తరచూ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా వారికి ఆన్ లైన్ బుకింగ్ సిస్టమ్ ను తాజా బడ్జెట్ లో ప్రకటించారు.