: ఘోరపరాజయం పాలైన ఇంగ్లండ్... సిరీస్ భారత్ వశం!
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో భారత జట్టు అనూహ్యంగా పుంజుకుని భారీ స్కోరు చేయగా, ఇంగ్లండ్ జట్టు చతికిలపడింది. ధాటిగా ఆడే క్రమంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు వరసగా పెవిలియన్ చేరి జట్టును ఇబ్బందుల్లోకి నెట్టారు. చాహల్ 14వ ఓవర్ లో మోర్గాన్ (40), రూట్ (42) వికెట్లు తీసి దెబ్బ కొట్టగా, తరువాతి ఓవర్ లో బుమ్రా బట్లర్ (0) ను దెబ్బకొట్టాడు. ఆ తరువాతి ఓవర్ లో చాహల్ తొలి బంతికి మొయిన్ అలీ (2) ని, నాలుగో బంతికి స్టోక్స్ (6) ని చివరి బంతికి జోర్డన్ (0)ని అవుట్ చేశాడు.
తరువాత బంతినందుకున్న బుమ్రా 17వ ఓవర్ తొలి బంతికి ప్లంకెట్ (0) ను బౌల్డ్ చేశాడు. తరువాతి బంతికి మిల్స్ ను అవుట్ చేశాడు. ఇంగ్లండ్ జట్టు 127 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ఇంగ్లండ్ పై 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో చాహల్ 6 వికెట్లతో అద్భుతంగా రాణించగా, బుమ్రా మూడు వికెట్లు, మిశ్రా ఒక వికెట్ తీశారు. దీంతో టీమిండియా మ్యాచ్ తో పాటు 2-1 తేడాతో సిరీస్ ను కూడా సొంతం చేసుకుంది. దీంతో ఇంగ్లండ్ జట్టును ఘోరంగా టెస్టు, వన్డే, టీ20 సిరీస్ లలో ఓడించింది.