: టోర్నీలో తొలిసారి భారీ స్కోరు చేసిన టీమిండియా...202/6
ఇంగ్లండ్-భారత్ టీ20 సిరీస్ లో తొలిసారి భారత జట్టు భారీ స్కోరు సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న చివరి టీ20 లో టీమిండియా ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. కెప్టెన్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. ఊహించని విధంగా సమన్వయ లోపంతో కోహ్లీ (2) రనౌట్ గా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన టీమిండియా వన్డే, టీ20 స్పెషలిస్టు బ్యాట్స్ మన్ సురేష్ రైనా తానెందుకు స్పెషలిస్టో మరోసారి నిరూపించాడు. గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో రైనా జూలు విదిల్చాడు.
తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో బంతిని బౌండరీ లైన్ దాటిస్తూ పరుగులు పిండుకున్నాడు. బౌలర్ ఎవరైనా తనకు సంబంధం లేదన్నట్టుగా భారీ సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో 43 బంతులాడిన రైనా 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రైనా స్పూర్తితో ధోనీ భారీ షాట్లు ప్రారంభించాడు. ఎదురుదాడికి దిగిన ధోనీ, రైనా వేగాన్ని మరిపించాడు. ఈ క్రమంలో ధోనీ (56) ఆకట్టుకున్నాడు. ధోనీ అండగా యువరాజ్ (27) శివాలెత్తిపోయాడు. జోర్డన్ వేసిన ఓవర్ లో విరుచుకుపడ్డాడు. తొలి బంతిని సింగిల్ చేసిన ధోనీ, యువీకి బ్యాటింగ్ రొటేట్ చేశాడు.
అంతే, తరువాతి బంతిని యువీ సిక్సర్ బాదాడు. ఆ తరువాతి బంతిని మరోసారి బౌండరీ లైన్ దాటించి సిక్సర్ నమోదు చేశాడు. తరువాతి బంతిని బౌండరీ బాదాడు. తరువాతి బంతిని మరో సిక్సర్ గా మలిచాడు. దీంతో స్కోరు బోర్డు ఒక్కసారిగా జెట్ స్పీడు అందుకుంది. ఈ క్రమంలో వీరిద్దరూ కేవలం 17 బంతుల్లో 44 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అనంతరం మిల్స్ వేసిన స్లో బంతిని అంచనా వేయడంలో తడబడ్డ యువీ టచ్ చేసి, కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. తరువాత భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ధోనీ నిష్క్రమించాడు. దీంతో రిషబ్ పంత్ (6)తో కలిసి పాండ్య (11) చివరి ఓవర్లో మెరుపులు మెరిపించారు. దీంతో నీర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఆరు వికెట్లు నష్టపోయి 202 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో మిల్స్, జోర్డన్, ప్లంకెట్, స్టోక్స్ చెరో వికెట్ తీశారు.