: నెలకు 13 కోట్లు ఖర్చుపెడుతూ దివాలా తీసిన హాలీవుడ్ నటుడు
ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ డెప్ దుబారా ఖర్చుతో వార్తల్లో నిలిచాడు. హాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమా ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’తో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన జానీ డెప్ నెలసరి ఖర్చు అక్షరాలా 13.5 కోట్ల రూపాయలని ది మేనేజ్ మెంట్ గ్రూప్ (టీఎంజీ) వెల్లడించింది. జానీ డెప్ కి ప్రపంచవ్యాప్తంగా 75 మిలియన్ డాలర్లు అంటే 500 కోట్ల రూపాయల విలువైన 14 విల్లాలున్నాయని టీఎంజీ తెలిపింది. వాటితో సరిపెట్టుకోని జానీ డెప్ 1120 కోట్ల రూపాయలతో 150 అడుగుల అధునాతన నౌకను కొనుగోలు చేశాడు. అంతే కాకుండా, జానీ డెప్ ప్రతి నెలా 20 లక్షలు పెట్టి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యాన్ని దిగుమతి చేసుకుంటాడట.
ఇంత దుబారాకు సమయానికి డబ్బులు చేతిలో లేక టీఎంజీ నుంచి 5 మిలియన్ డాలర్ల లోను తీసుకున్నాడట. ఆ మొత్తం తిరిగి చెల్లించేందుకు నిరాకరించాడట. అంతే కాకుండా తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుపోయానని, తన ఆర్థిక ఇబ్బందులకు టీఎంజీ కంపెనీ అసమర్థ నిర్ణయాలు కారణమని కేసు నమోదు చేశాడని టీఎంజీ తెలిపింది. జానీ డెప్ ఆర్ధిక వ్యవహారాలు టీఎంజీ గత 17 ఏళ్లుగా చూస్తోందని, ఆయనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుందని, అయితే దుబారాకు పోయిన డెప్ చేజేతులా అప్పుల్లో కూరుకుపోయాడని టీఎంజీ ఆరోపించింది. లోన్ తీసుకున్న డెప్ తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే పరువు పోతుందని భావించిన టీఎంజీ కంపెనీయే అతని లోన్ చెల్లించిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అలాంటి కంపెనీపై ఫిర్యాదు చేయడంతోనే తాము కూడా డెప్ పై ఫిర్యాదు చేస్తున్నామని టీఎంజీ యాజమాన్యం తెలిపింది.