: అక్కడ బస చేస్తే ‘ఏలియన్స్’ను చూడచ్చట!


గ్రహాంతర వాసులు (ఏలియన్స్) ఉన్నారా? లేరా? అనే విషయమై ఇప్పటికీ పరిశోధనలు కొనసాగుతున్నాయి. వింత ఆకారంలో ఉన్న వాహనాల్లో ఏలియన్స్ తిరుగుతుంటాయనే వార్తలూ ఎప్పటి నుంచో వింటున్నాము.వారు తిరిగే వాహనాలను అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్టు (యూఎఫ్ఓ)గా పిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆస్ట్రేలియాలోని టెన్నెంట్ క్రీక్-అలిస్ స్పింగ్స్ పట్టణాల మధ్య ‘వేక్లిఫ్ వెల్’ అనే నగరం ఉంది. ఈ నగరాన్ని‘యూఎఫ్ఓ కాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా’గా పిలుస్తుంటారు.
ఈ నగరంలో ఏలియన్స్ తమ యూఎఫ్ఓ ల్లో వచ్చి సంచరిస్తుంటారట. ఈ నమ్మకం ఏర్పడడానికి వెనుక ఆసక్తిదాయకమైన ఓ కథ ప్రచారంలో ఉంది.

వేక్లిఫ్ వెల్ నగరంలో మొదట్లో ఎలాంటి సదుపాయాలు లేవు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో సైన్యానికి ఇక్కడ ఆశ్రయం కల్పించడంతో జనసంచారం పెరిగింది. అప్పట్లో, ఇక్కడే ఉన్న ఒక సైనికుడు ప్రతిరోజూ రాత్రి సమయంలో విచిత్రమైన ఆకారాలు తిరుగుతుండటం గమనించాడట. ఈ ఆకారాలు ఆకాశం నుంచి భూమికి చేరువగా తిరుగుతుండేవట. ఈ విషయాలన్నింటిని ఆ సైనికుడు తన పుస్తకంలో నోటు చేసుకునేవాడు. అయితే, ఆ విచిత్ర ఆకారాలే ఏలియన్స్ అయి ఉంటాయని నేడు భావిస్తున్నారు.

ఈ క్రమంలో ‘వేక్లిఫ్ వెల్’ నగరంలో రెస్టారెంట్లు, ‘ఏలియన్స్’ థీమ్ పార్కులు వెలిశాయి. వింత ఆకారాల వివరాల గురించి నాడు సైనికుడు నోటు చేసుకున్న పుస్తకాన్ని ఇక్కడి ఓ రెస్టారెంట్ లో ప్రదర్శనకు ఉంచారు. ‘ఏలియన్స్’ను చూడొచ్చని భావించే పర్యాటకులు, ఆ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు ఆయా రెస్టారెంట్లలో బస చేస్తుంటారు. అయితే, ‘ఏలియన్స్’ కనపడతాయని మాత్రం ఆయా రెస్టారెంట్ల యజమానులు మాత్రం గ్యారంటీ ఇవ్వడం లేదు. ‘ఏలియన్స్’ కనిపిస్తే మాత్రం మీరు అదృష్ట వంతులేనని రెస్టారెంట్ల యజమానులు చెబుతున్నారట.

  • Loading...

More Telugu News