: అక్కడి రైల్వేస్టేషన్ లో మార్కెట్.. నెలలో ఒకరోజు మాత్రమే!
కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్, పూల మార్కెట్ లలో ఏమి ఉంటాయో, విక్రయిస్తారో మన అందరికీ తెలుసు. కానీ,స్పెయిన్ దేశ రాజధాని బార్సిలోనాలో మాత్రం ‘రైల్వేస్టేషన్ లో మార్కెట్’ ఏర్పాటు చేస్తుంటారు. ఇస్టాషియా డె ఫ్రాన్సా అనే రైల్వేస్టేషన్ లో ప్రతి నెలలో ఒక్క రోజు మాత్రమే నిర్వహించే రైల్వేస్టేషన్ మార్కెట్ లో ఏం విక్రయిస్తారంటే.. రైళ్లకు సంబంధించిన వస్తువులు, చిన్నపిల్లలు ఆడుకునే రైలు బొమ్మలు, రైలు ఇంజన్లు, రైల్వే శాఖ వారు ఉపయోగించే లాంతర్లు, రైళ్ల గురించి రాసిన పుస్తకాలు..ఇలా రైళ్లకు సంబంధించిన ప్రతి వస్తువు ఇక్కడ విక్రయిస్తుంటారు. రైల్వే మార్కెట్ నిర్వహించే సంప్రదాయం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. 1950-60 కాలంలో వేల మంది చిన్నారులు ఈ మార్కెట్ కి వచ్చి బొమ్మలు కొనుగోలు చేసేవారని, ఈ మధ్య కాలంలో మాత్రం ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గిపోయిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఫ్లాట్ ఫారాలపైనే స్టాల్స్ ఏర్పాటు చేసి రైళ్లకు సంబంధించిన వస్తువులను విక్రయిస్తుంటామని చెప్పారు.