: బడ్జెట్ చాలా చప్పగా ఉంది: కాంగ్రెస్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భారతీయ జనతా పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేయగా, కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు మాట్లాడుతూ... ఈ బడ్జెట్ మూసధోరణిని బద్దలుకొట్టిందని అన్నారు. దీంతో కొత్త యుగం ఆరంభమవుతుందని ఉద్ఘాటించారు. కేంద్ర మంత్రి అనంతకుమార్ స్పందిస్తూ... ఇది విప్లవాత్మక, రూపాంతరీకరణ బడ్జెట్‌గా పేర్కొన్నారు. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే విధంగా ముందడుగు పడుతుందని జోస్యం చెప్పారు. మరో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ ఈ బడ్జెట్ రైతు, పేదలకు అనుకూలంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ బడ్జెట్ చాలా చప్పగా ఉందని అన్నారు. కాంగ్రెస్ నేత మనీష్ తివారి స్పందిస్తూ ఇదో ఆడంబర బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. ఉపాధి కల్పన గురించి కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని, రైల్వేకు ఒరిగిందేం లేదని అన్నారు. మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఉందని చెప్పారు.