: సంప్రదాయాలకు భిన్నం, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల విభజన లేకుండా జైట్లీ నాలుగో బడ్జెట్
సంప్రదాయాలకు భిన్నంగా, భారత చరిత్రలో తొలిసారిగా రైల్వే, సాధారణ బడ్జెట్ లను కలిపి అరుణ్ జైట్లీ తన జీవితంలో నాలుగోసారి బడ్జెట్ ను పార్లమెంట్ ముందుకు తెచ్చారు. ఈ దఫా ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల విభజన లేకుండా బడ్జెట్ ఉంటుందని ఆయన వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు తరువాత ఈ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామని, దీనిపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయన్న సంగతి తనకు తెలుసునని అన్నారు. పరిపాలనలో పారదర్శకత వచ్చేలా ప్రతిపాదనలు ఉంటాయని, అభివృద్ధి ఫలాలను అందరికీ అందిస్తామని తెలిపారు. గడచిన ఏడాది కాలంగా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, జీడీపీని స్థిరంగా ఉంచడం తమ ప్రభుత్వం సాధించిన విజయాలని అన్నారు. ఈ సంవత్సరం వృద్ధి రేటు మరింతగా పెరుగుతుందన్న నమ్మకం ఉన్నట్టు తెలిపారు.
గత సంవత్సరం ప్రపంచంలో టాప్-9 మాన్యుఫాక్చరింగ్ కంట్రీగా ఉన్న ఇండియా, ఈ సంవత్సరం ఆరవ స్థానానికి ఎదిగిందని జైట్లీ గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ బిల్లును ఆమోదించిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు జైట్లీ వెల్లడించారు. 2017లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని, ఆర్థిక సమస్యలు తగ్గుతాయని అన్నారు. లంచగొండితనం, అవినీతి, నల్లధనాన్ని నివారించడమే లక్ష్యంగా ప్రభుత్వం సాగుతోందని తెలిపారు. జైట్లీ ప్రసంగం కొనసాగుతోంది.