: ఎంతైనా తాగండి... ఇంట్లో పడుకోండి: తెలంగాణ హోంమంత్రి నాయిని సలహా
మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్లపై అమాయకుల ప్రాణాలు హరించవద్దని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సలహా ఇచ్చారు. తాగి వాహనాలు నడిపిన వారి కారణంగా రాష్ట్రంలో 30 వేల కుటుంబాలకు జీవనాధారం లేకుండా పోయిందని ఆయన అన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం జరుగగా, నాయిని పాల్గొన్నారు.
"మద్యం ఎంతైనా తాగండి. ఇంట్లోనే పడుకోండి. తాగి వాహనాలు నడపవద్దు. ప్రజల ప్రాణాలు తీయవద్దు" అని ఆయన అన్నారు. పిల్లల తప్పుడు పనుల కారణంగా తల్లిదండ్రుల పరువు పోతోందని, నలుగురిలో తలదించుకునే పరిస్థితిని ఏ బిడ్డా తీసుకురావద్దని హితవు పలికారు. రాష్ట్రంలో సంవత్సరానికి సగటున ఏడు వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని గుర్తు చేసిన ఆయన, మరో 23 వేల మందికి పైగా గాయాల పాలవుతున్నారని, ఈ కేసుల్లో అత్యధికం మద్యం మత్తులో జరుగుతున్నవేనని అన్నారు.