: పాలిచ్చే తల్లివేనా?... అయితే చూపించు...: భారత యువతికి ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయంలో తీరని అవమానం!


సింగపూర్ లోని ఓ ట్రాన్స్ పోర్టు కంపెనీలో పనిచేస్తున్న భారత యువతి పారిస్ వెళ్లేందుకు జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయానికి వెళ్లిన వేళ, ఆమెకు తీరని అవమానం ఎదురైంది. గాయత్రీ బోస్ అనే యువతి లగేజీలో చిన్నారుల కోసం పాలు పితికే బ్రెస్ట్ పంప్ ఉండటమే ఆమెను అవమానానికి గురి చేసింది. గాయత్రికి మూడేళ్ల బాబు, ఏడు నెలల పాప ఉండగా, వారు లేకుండా ఆమె ప్రయాణించాల్సి వచ్చింది. బ్రెస్ట్ పంప్ ను చూసిన ఓ భద్రతాధికారిణి, గాయత్రిని పక్క గదికి తీసుకువెళ్లి నానా ప్రశ్నలూ వేసి వేధింపులకు గురిచేశారు.

"నువ్వసలు పాలిచ్చే తల్లివేనా? అయితే బిడ్డ ఎందుకు లేదు? మాకు అనుమానాలు ఉన్నాయి. జాకెట్ తీయి. పాలు వస్తున్నాయా? అన్న విషయాన్ని చూపించు... అంటూ నన్ను ఎంతో వ్యధకు గురిచేశారు. పాస్ పోర్టు తీసుకుని పాలు వస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు రొమ్ములను ప్రెస్ చేయమన్నారు. నేను వారు చెప్పినట్టు చేయక తప్పలేదు. తరువాత దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎంతో ఏడుపు వచ్చింది. ఆపై మరోసారి బ్రెస్ట్ పంప్ ను పరిశీలించి, పారిస్ వెళ్లేందుకు అనుమతించి, పాస్ పోర్టును తిరిగి ఇచ్చారు. దీనిపై అడిగితే, జరిగిందేదో జరిగిపోయింది, గొడవ చేయకుండా వెళ్లిపోమని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు" అని వాపోయింది గాయత్రి. ఈ విషయంలో స్పందించేందుకు ఫ్రాంక్ ఫర్ట్ అధికారులు నిరాకరించగా, మాతృమూర్తిని ఇలా వేధించడం అర్థం లేనిదని పలువురు విమర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News