: సమంతే నా కోడలని నాన్నకు ముందే తెలుసనిపిస్తోంది: నాగార్జున నోట ఆసక్తికర మాట
తన తాజా చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' ప్రమోషన్ లో భాగంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. సమంత తన ఇంటి కోడలు అవుతుందని ముందే ఆయనకు తెలుసనిపిస్తోందని చెప్పారు. 'మనం' చిత్రం క్లైమాక్స్ ను ప్రస్తావిస్తూ, చివరి సీన్ లో తనతో పాటు నాన్న, సమంత, నాగచైతన్య, అఖిల్, శ్రియ ఉన్నారని గుర్తు చేశారు. అఖిల్ భార్య పేరు శ్రియ అని, నాగచైతన్య, సమంత ఒకటి కాబోతున్నారని ఆ విధంగా చిత్రంలో ఉన్న పాత్రలతో తమ గ్రూప్ ఫోటో అయిపోయిందని అన్నారు.
ఆ చిత్రం షూటింగ్ సమయంలో నాగచైతన్య, సమంత, తాను కలసి చేసిన సీన్లు తక్కువగా ఉన్నాయని, నేను ఉన్న సమయంలో వాళ్లిద్దరూ కుదురుగానే ఉండేవాళ్లని, అందువల్ల వారి మధ్య లవ్ ట్రాక్ ఉన్నట్టు తనకు తెలియలేదని అన్నారు. ఇక నాన్న వద్ద దొరికిపోకూడదని కంట్రోల్ లో ఉన్నట్టు తాను తరువాత తెలుసుకున్నానని, ఒక విధంగా తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ, తనకు సంబంధాలు వెతికే శ్రమ తగ్గించాడని చెప్పుకొచ్చారు.