: ఒత్తిడికి లొంగిన ప్రభుత్వం.. విశాఖపట్నం జిల్లాలో ల్యాండ్ పూలింగ్ కు బ్రేక్!
వందల కోట్ల విలువైన భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలనుకున్న ఏపీ ప్రభుత్వం... ఆ ప్రయత్నానికి తాత్కాలికంగా బ్రేక్ వేసింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంతో పాటు భీమిలి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఓ మంత్రి, కొందరు అధికార పార్టీ నాయకులు ఈ పూలింగ్ ద్వారా భూములను అక్రమంగా కొట్టేయడానికి ప్లాన్ వేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కొన్ని పత్రికల్లో సైతం ఈ విషయం ప్రధానంగా ప్రచురితమైంది. దీంతో, ప్రభుత్వం కాస్త తగ్గింది. ల్యాండ్ పూలింగ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
ఇప్పటి వరకు సేకరించిన భూములపై పునర్విచారణ జరిపిస్తామని, ఇకపై ఈ విషయానికి సంబంధించి మీడియా సమక్షంలోనే గ్రామ సభలను నిర్వహిస్తామని వుడా వైస్ ఛైర్మన్ బాబూరావునాయుడు తెలిపారు. అక్కడి నుంచి వచ్చే తదుపరి ఉత్తర్వుల మేరకు నడుచుకుంటామని చెప్పారు.