: కారుపై సింహాల దాడి.. ప్రాణభయంతో వణికిపోయిన సందర్శకులు
బెంగళూరు సమీపంలోని బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్(బీబీపీ)లో గతవారం జరిగినట్టుగా చెబుతున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సందర్శకులు వెళ్తున్న కారుపై దాడి చేసిన రెండు సింహాలు లోపలున్న వారిని భయభ్రాంతులకు గురిచేశాయి. కారు అద్దాలకు రక్షణగా ఉండాల్సిన ఇనుప మెష్ దీనికి లేకపోవడంతో ప్రాణభయంతో వారు వణికిపోయారు. చివరికి కారులోని వారు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సందర్శకుల కోసం వినియోగించే ఈ కారుపై సింహాలు దాడి చేయడం ఇది రెండోసారి.
కారుపై రెండు సింహాలు దాడి చేస్తున్న వీడియో స్థానిక టీవీ చానళ్లలో మంగళవారం విస్తృతంగా ప్రసారమైంది. కారుపై సింహాలు దాడి చేస్తున్న సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని వాటి బారి నుంచి కారులోని వారిని రక్షించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు పార్క్ అధికారులు పేర్కొన్నారు. అద్దాలకు మెష్ లేని కారు సఫారీలోకి ఎలా వెళ్లిందనే దానిపై ఆరా తీస్తున్నట్టు బీబీపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. జనవరి 28న కానీ, లేదంటే 29న కానీ ఈ ఘటన జరిగి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. కారుపై సింహాలు దాడి చేస్తున్న సమయంలో డ్రైవర్ కారును ఆపి ఉండాల్సింది కాదని అన్నారు.