: పోలవరంలో నేడు కీలక ఘట్టం.. డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను ప్రారంభించనున్న చంద్రబాబు
ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టులో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు, ప్రాజెక్టులో 48 గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణంలో అంతర్జాతీయంగా పేరున్న ఎల్ అండీ టీ బావర్ కంపెనీయే పోలవరం డయాఫ్రం వాల్‌ను కూడా నిర్మించనుంది. ప్రాజెక్టులో ఈ వాల్ నిర్మాణం అత్యంత ముఖ్యమైనది. మట్టి, రాతికట్ట పనుల్లో భాగంగా గోదావరి నది మధ్యలో దిగువ నుంచి పునాదిగా దీనిని నిర్మించాల్సి ఉంటుంది. నదిలో 40-100 మీటర్ల లోతుకు వెళ్లి వాల్ నిర్మించుకుంటూ రావాల్సి ఉంటుంది. ఒక సీజన్‌లో 800 మీటర్లు, మరో సీజన్‌లో మరో 800 మీటర్లు పూర్తి చేసి రెండు సీజన్లలో పని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.