: బంగ్లాదేశ్ తో టెస్ట్ మ్యాచ్: పార్థివ్ కు మొండి చెయ్యి చూపిన సెలెక్టర్లు
ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో రాణించి, ఆకట్టుకున్న పార్థివ్ పటేల్ కు టీమిండియా సెలెక్టర్లు మొండిచెయ్యి చూపించారు. బంగ్లాదేశ్ తో మార్చి 9న హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కు జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లు పార్థివ్ ను ఎంపిక చేయలేదు. వృద్ధిమాన్ సాహా గాయపడడంతో జట్టులో స్థానం దక్కించుకున్న పార్థివ్ ఆకట్టుకున్నాడు. అయితే ఊహించని విధంగా 2011లో జట్టులో స్థానం సంపాదించి తరువాత జట్టులో స్థానం కోల్పోయిన అభినవ్ ముకుంద్ కు ఈ సారి స్థానం కల్పించడం విశేషం.
గాయాల కారణంగా జట్టుకు దూరమైన ఓపెనర్ మురళీ విజయ్ తో పాటు వృద్ధిమాన్ సాహా కు మళ్లీ జట్టులో స్థానం కల్పించారు. కాగా, తాను ఎవరి కోసమో లేక జట్టులో స్థానం కోసమో సుదీర్ఘంగా ఆడడం లేదని, టీమిండియాలో చోటుదక్కకపోయినా ఆడడం తనకు ఇష్టమని, అందుకోసమే ఆడుతున్నానని అతను వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
బంగ్లాదేశ్ తో ఏకైక టెస్టులో ఆడనున్న భారత జట్టు వివరాల్లోకి వెళ్తే... విరాట్ కోహ్లి (కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, అజింక్యా రహానే, కరుణ్ నాయర్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా, అభినవ్ ముకుంద్, హార్దిక్ పాండ్యా