: మోదీతో ట్రంప్ చాలా బాగా మాట్లాడారు...నిక్కీ హేలీ పనితీరు అద్భుతం: వైట్ హౌస్ సెక్రటరీ
'అమెరికా ప్రయోజనాలే ముఖ్యం...ఆ తరువాతే ఏ దేశ ప్రయోజనాలైనా' అని తన చర్యల ద్వారా బలంగా కోరుకుంటున్నట్టు నిరూపిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ తో అనుబంధాన్ని కొనసాగించాలని భావిస్తున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సియాన్ స్పైసర్ తెలిపారు. రోజువారీ నిర్వహించే పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏఏ అంశాల మధ్య మాట్లాడుకున్నారు? ఈ రెండు దేశాల మధ్య ఎలాంటి సంబంధాలు నెలకొననున్నాయి? అంటూ వేసిన ప్రశ్నకు సమాధానమిచ్చిన స్పైసర్... ట్రంప్, మోదీ వివిధ అంశాలపై మాట్లాడుకున్నారని చెప్పారు.
ట్రంప్, మోదీ సారథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమవుతాయని తెలిపారు. మరి గత అధ్యక్షుడు ఒబామా ఐక్యరాజ్యసమితిలో భారత్ కు శాశ్వత సభ్యత్వంపై ఇచ్చిన మద్దతు కొనసాగుతుందా? అని అడుగగా, ఆయన సమాధానం దాటవేశారు. ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హాలీ పనితీరు చాలా బాగుందని ఆయన కితాబునిచ్చారు. కాగా, నిక్కీ హాలీ భారత సంతతి వ్యక్తి అన్న సంగతి తెలిసిందే.