: మేము చేసిన మంచి పనులకు కాంగ్రెస్ నేతల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి: సీఎం కేసీఆర్


తాము చేసిన మంచి పనులకు కాంగ్రెస్ నేతల కళ్లు బైర్లు కమ్ముతున్నాయని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండా వద్ద నిర్మించిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం తిరుమలాయపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. భవిష్యత్ పై భయంతోనే కాంగ్రెస్ పార్టీ నేతలు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము ఏ ప్రాజెక్టు పెట్టినా కోర్టులకు వెళ్లి అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక ముఠాను తయారు చేసుకుందని ఆరోపించారు.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి చిదంబరానికి ఏం తెలుసని ప్రశ్నించారు. తెలంగాణలో రూ.35 వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం వాస్తవం కాదా? అని ఆయన నిలదీశారు. విద్యార్థులకు సన్నబియ్యం పెట్టాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ వారికి ఎప్పుడైనా వచ్చిందా? అని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రశ్నించారు. ఏడాదిలోపు ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ తో పాటు మంచినీరు అందిస్తామని, యాదవ కులస్తులకు 75 శాతం సబ్సిడితో నాలుగు లక్షల గొర్రెల యూనిట్లు ఇస్తామని, మత్స్యకారులు, చేనేత కార్మికులు, హోంగార్డుల జీవితాల్లో వెలుగులు నింపుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News