: దాసరిది సెన్సిటివ్ ఇష్యూ, ఎక్కువ అడక్కండి...రెండు మూడు రోజులు పడుతుంది: కిమ్స్ వైద్యులు
దాసరి నారాయణరావుకు చెస్ట్ ఆపరేషన్ పూర్తి చేశామని వైద్యులు తెలిపారు. దాసరి ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన నెలకొన్న నేపథ్యంలో హైదరాబాదు, కిమ్స్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావును శ్వాసకోస ఇబ్బందులతో రెండు రోజుల క్రితం తమ ఆసుపత్రి (కిమ్స్) లో చేర్చారని అన్నారు. ఈ సందర్భంగా చేసిన పరీక్షల్లో ఆయన అన్నవాహికలో రాపిడి ఏర్పడిందని గుర్తించామని తెలిపారు. దానికి ట్యూబ్ పెట్టి అన్నవాహిక శుద్ధి చేసి, రాపిడి దగ్గర మెటల్ స్టెంట్ వేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన శరీరం సహకరించక కిడ్నీ ఫెయిల్యూర్, లంగ్స్ ఫెయిల్యూర్ వచ్చిందని అన్నారు. దీంతో ఆయన కిడ్నీ పని చేసేందుకు డయాలసిస్ సహాయం తీసుకున్నామని, లంగ్స్ ఫెయిల్యూర్ సరిచేసేందుకు అన్నవాహికలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ ను తొలగించామని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రెండు లేదా మూడు రోజులు పూర్తి అబ్జర్వేషన్ లో ఉంచి ఆయనకు చికిత్స అందించాలని, అప్పటి వరకు ఏదీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. ఇది సున్నితమైన అంశమన్న సంగతి గుర్తించి, దీనిపై ఎక్కువ అడగద్దని వారు తెలిపారు.