: వైకాపాను వీడటం లేదు... జగన్ నుంచి విడిపోవడం అసాధ్యం: వైయస్ మనోహర్ రెడ్డి
వైఎస్ కుటుంబంలోని సభ్యులంతా కలసికట్టుగానే ఉన్నామని పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్ వైయస్ మనోహర్ రెడ్డి తెలిపారు. 1995లో తమ చిన్నాన్న రాజారెడ్డి పంచాయతీ వ్యవహారాలను కూడా తనకే అప్పగించారని... అప్పట్నుంచి పులివెందుల వ్యవహారాలన్నింటినీ తానే చూసుకుంటున్నానని చెప్పారు. రెండు దశాబ్దాలకు పైగా పులివెందుల పంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలో అధికారాన్ని తనకే కట్టబెట్టారని అన్నారు. తాను వైకాపాను వీడుతున్నట్టు కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయని... అది తననెంతో బాధించిందని మనోహర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను వైకాపాను ఎట్టి పరిస్థితుల్లోను వీడనని స్పష్టం చేశారు. తమ కుటుంబ సభ్యులమంతా ఒకటేనని... జగన్ నుంచి తాను విడిపోవడమనేది కలే అని చెప్పారు. తన భార్య ప్రమీల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఉన్నారని... ఇలాంటి పరిస్థితుల్లో వైకాపాను వీడాల్సిన అవసరం తనకేముందని ప్రశ్నించారు.