: సర్జికల్ దాడులైనా, నోట్ల రద్దయినా ప్రజలు వెన్నంటి ఉండటమే మా బలం: ప్రణబ్ ముఖర్జీ
తన ప్రభుత్వానికి భారత ప్రజలు పూర్తి అండగా నిలిచారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వ్యాఖ్యానించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేసిన వేళ, సర్జికల్ దాడులు జరిపితే, వాటిని ప్రజలు ముక్తకంఠంతో స్వాగతించారని గుర్తు చేశారు. భారత సైన్యం చూపించిన అసమాన ధైర్యసాహసాలకు జాతి యావత్తూ సెల్యూట్ చేసిందని చెప్పారు. నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన తరువాత ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా ప్రభుత్వ నిర్ణయంతో తమకు మేలు కలుగుతుందని నమ్మారని, వారి నమ్మకాన్ని వమ్ము కానీయబోమని తెలిపారు.
కిషోర్ కుశాల్ యోజన కింద పిల్లలకు వాక్సిన్లను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించి, దాన్ని విజయవంతం చేశామని ప్రణబ్ తెలిపారు. గర్బిణీ స్త్రీలకు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 24 వారాలకు పెంచిన ఘనత తన ప్రభుత్వానిదేనని అన్నారు. అసంఘటిత రంగాల్లోనూ ఉద్యోగులకు జీతాలను బ్యాంకుల ద్వారా చెల్లించే ఏర్పాటు చేశామని ప్రణబ్ గుర్తు చేశారు. ఏడో వేతన సంఘ సిఫార్సుల అమలు ద్వారా 50 లక్షల మంది ఉద్యోగులకు లాభం కలిగిందని తెలిపారు. వీరికి అదనంగా మరో 30 లక్షల మందికి వస్తున్న పెన్షన్ మొత్తం పెరిగిందని తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో మెజారిటీ వాటాను కేంద్రమే భరిస్తుందని, ఈ రాష్ట్రాల్లో ఇప్పటికీ మీటర్ గేజ్ లుగా ఉన్న రైలు మార్గాలను బ్రాడ్ గేజ్ లుగా మార్చాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో టూరిజం సర్క్యూట్ కు మరిన్ని నిధులను ఇవ్వనున్నట్టు ప్రకటించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 5 వేల కిలోమీటర్ల మేరకు కొత్త రహదారుల నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు.
దేశంలో 60 శాతం మందికి పైగా ప్రజలు యువతేనని, వారి బలమే దేశాన్ని ముందుకు నడిపిస్తోందని, ఎన్నో దేశాలకన్నా మిన్నగా దేశ వృద్ధి రేటు ఉండటం యువ శక్తికి నిదర్శనమని ప్రణబ్ తెలియజేశారు. ఒకేసారి 20 ఉపగ్రహాలను ప్రయోగించి విజయవంతం కావడం టెక్నాలజీ, అంతరిక్ష రంగాల్లో భారత్ సాధించిన అద్భుత ఘనతని కొనియాడారు. సాగరమాల ప్రాజెక్టు నిమిత్తం రూ. 3 లక్షల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. లోక్ సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై చర్చలు జరగాల్సి వుందని ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు.