: డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఇక తప్పించుకోలేరు.. కనీసం రెండు రోజులైనా జైలుకెళ్లాల్సిందే!
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండెక్కితే ఇక తప్పించుకోలేరు. కనీసం రెండు రోజులైనా జైలు శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఈమేరకు సోమవారం హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు, న్యాయ విభాగం మధ్య జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ కోర్టుల న్యాయమూర్తులు, ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే నేటి(మంగళవారం) నుంచే జైలుకు పంపించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనివారిని గుర్తించేందుకు ఆర్టీఏ అధికారులతో కలిసి ఆటోలు, ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు డీసీపీ రంగనాథ్ తెలిపారు.
గతేడాది చివరి నాటికి నగరంలో 50 లక్షల వాహనాలు రిజిస్టర్ అయితే సిటీలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్‌లు మాత్రం 20 లక్షలే. మొత్తం వాహనాల్లో ద్విచక్రవాహనాలు 45 లక్షలైతే ఆ తరహా లైసెన్స్‌లు కేవలం పదిలక్షలే. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా దొరికితే వందో, యాభయ్యో చేతిలో పెట్టి తప్పించుకునే వారిని పట్టుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. లైసెన్స్ లేకుండా బండి నడుపుతూ పట్టుబడిన వారిపై కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేసి జైలుకు పంపించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి రానుంది.