: మోదీ అలా అంటారా?.. ప్రధాని వ్యాఖ్యలను తప్పుపట్టిన శరద్‌పవార్
కాంగ్రెస్‌పై గత కొంతకాలంగా ప్రధాని మోదీ చేస్తున్న వ్యాఖ్యలను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తప్పుబట్టారు. అభిప్రాయ భేదాలు ఉన్నంత మాత్రాన పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న ఒక బలీయమైన శక్తిని అంతమొందించాలని అనుకోవడం బాధాకరమన్నారు. అలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయకూడదని అన్నారు. ముఖ్యంగా ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి అది తగదని హితవు పలికారు. సోమవారం గోవా రాజధాని పనాజీలో మాట్లాడిన ఆయన బీజేపీ, ఎన్సీపీ పొత్తుపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపడేశారు. అది వదంతి మాత్రమేనన్నారు. కాంగ్రెస్‌తో ఎన్సీపీకి కొన్ని విభేదాలు ఉన్న మాట నిజమేనన్న పవార్ స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ దేశానికి ఎంతోకొంత చేసిందన్నారు. ఈ విషయాన్ని కొట్టిపడేయలేమన్నారు. ఓ పార్టీతో విభేదాలు ఉన్నంత మాత్రాన దానిని మట్టుబెట్టేస్తామని, సమాధి చేస్తామని మాట్లాడడం సబబు కాదన్నారు.