: అమెరికా చరిత్రలో రికార్డు నెలకొల్పిన ముస్లింల వలస!
అమెరికాలో 2016 ఆర్థిక సంవత్సరంలో సుమారు 39 వేల మంది ముస్లిం శరణార్థులు కాలుమోపారని గణాంకాలు వెలుగు చూశాయి. ఇంత భారీ మొత్తంలో ముస్లింలు అమెరికాలో ప్రవేశించడం ఇదే తొలిసారి. దీంతో ఇది అమెరికా చరిత్రలోనే రికార్డుగా నమోదైంది. సిరియా శరణార్థులు సహా ఆరు ముస్లిం దేశాలకు చెందిన ప్రజలు అమెరికాలో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ట్రావెల్ బ్యాన్ విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం నేపథ్యంలో ఈ గణాంకాలు వెలుగులోకి రావడం విశేషం. ఇంకా ఈ నివేదిక ద్వారా, సెప్టెంబరుతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో 84,995 మంది శరణార్థులు అమెరికాలో అడుగుపెట్టినట్టు తెలిసింది. ఒబామా పాలనలోనే ఎక్కువ మంది శరణార్థులు అమెరికాకు వచ్చారని ఈ నివేదిక వెల్లడించింది.
వారే కాకుండా మరో 31,143 శరణార్థులు అక్టోబరు 1 నుంచి జనవరి 24 మధ్య అమెరికాకు వలస వచ్చారని ఈ నివేదిక పేర్కొంది. ట్రంప్ అధ్యక్షుడైన తరువాత వీరిలో 1,136 మంది శరణార్థులు జనవరి 20న అమెరికాలో కాలుపెట్టినట్టు యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ రిఫ్యూజీ ప్రాసెసింగ్ సెంటర్ గణాంకాలు స్పష్టం చేశాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా 2016 ఆర్థిక సంవత్సరంలో అమెరికాలో రికార్డు స్థాయిలో సుమారు 39 వేల మంది ముస్లిం శరణార్థులు అడుగుపెట్టినట్టు తేలింది. ఈ లెక్కన రెఫ్యూజీ అడ్మిషన్లలో సుమారు సగం అంటే 46 శాతం ముస్లింలే ఉన్నారని, వారి తరువాతి స్థానంలో 44 శాతంతో క్రిష్టియన్ శరణార్థులు ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ నిషేధాజ్ఞలు పెను దుమారం రేపుతున్నాయి.