: నా భర్తను ఓడించేందుకు నీచానికి దిగజారిన బీజేపీపై కేసు నమోదు చెయ్యండి: ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి భార్య
ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అయిన తన భర్తను ఓడించేందుకు బీజేపీ తనపై నీచమైన వ్యాఖ్యలు చేసిందంటూ గోవాలోని శిరోదా నియోజకవర్గ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోలు విలిప్ అనే వ్యక్తి భార్య పొండా పోలీస్ స్టేషన్ లో సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... గోవాలో అధికార బీజేపీకి చెందిన పరిశ్రమల శాఖ మంత్రి మహదేవ్ నాయక్ శిరోదాలో పర్యటించారు. ఈ సందర్భంగా విలిప్ భార్యపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.
పూనం సావంత్ అనే బీజేపీ కార్యకర్తతో మంత్రి నాయక్ మాట్లాడుతున్న వీడియో ఒకటి లీకైంది. అందులో విలిప్ భార్య ఓటర్ల కాళ్లకు దండాలు పెడతారని, మగ ఓటర్లకు ఇతర మార్గాల్లోనూ ‘వల’ విసురుతారని, మనకు (బీజేపీకి) మాత్రం అలాంటి అవసరం లేదని మంత్రి వ్యాఖ్యానించడం వీడియోలో స్పష్టంగా రికార్డయింది. ఈ వీడియోను సంపాదించిన విలిప్ భార్య పొండా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తన భర్తను ఓడించేందుకు బీజేపీవాళ్లు నీచానికి తెగబడుతున్నారని, తనపై అసభ్యకర ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో కోరారు. వీడియోలోని వ్యాఖ్యల ఆధారంగా పోలీసులు మంత్రి నాయక్ పై కేసు నమోదు చేశారు. కాగా, గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగనున్నాయి.