: ఇంత క్షోభ భరించే కన్నా ఆడపిల్లను పురిట్లో చంపేయడమే మంచిది: యాక్సిడెంటులో మరణించిన గౌతమి తల్లి


నడిరోడ్డుపై ప్రణాళిక ప్రకారం హత్య చేస్తే పోలీసులు ప్రమాదం అంటున్నారు... అధికార పార్టీతో ఇబ్బందులు ఎందుకని రాజకీయ నేతలెవరూ సాయం చెయ్యడంలేదు... దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని జనవరి 18న నరసాపురంలో రోడ్ యాక్సిడెంట్ లో మరణించిన గౌతమి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గౌతమి సోదరి పావని మాట్లాడుతూ, ఆ రోజు ఆసుపత్రి నుంచి తన సోదరి, తాను ఇంటికి వస్తున్నామని వెనుక నుంచి వచ్చిన స్కార్పియో తమను ఢీ కొట్టి, తన అక్కను వందగజాల దూరం ఈడ్చుకుపోయిందని అందుకే ఆమె మరణించిందని చెప్పారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దానిని ప్రమాదంగా తీర్చిదిద్దారు. పోలీసులు చెబుతున్న ఈ కథనమే పూర్తిగా కట్టుకథ అని వారు చెబుతున్నారు.

పావని చెబుతున్న ప్రకారం... వాస్తవానికి గౌతమి తండ్రికి సుస్తీగా ఉన్న సమయంలో స్థానిక టీడీపీ నేత సజ్జ బుజ్జి కళాశాలకు వెళ్లి వస్తున్న గౌతమితో పరిచయం పెంచుకున్నాడు. ఆమె తండ్రికి సహాయం చేస్తానన్న నెపంతో పరిచయాన్ని చనువుగా మార్చుకున్నాడు. అనంతరం తన భార్యతో పడడం లేదని, ఆమెకు విడాకులిచ్చేసి నిన్ను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి, ఓ గుళ్లో గౌతమిని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమలో వారి వివాహం సంగతి సజ్జ బుజ్జి మొదటి భార్య శిరీష్ కు తెలియడంతో ఆమె పలుమార్లు గౌతమిని హెచ్చరించిందని, దీంతో ఆమే ఈ హత్య చేయించిందని పావని ఆరోపిస్తోంది. దీనికి ప్రధాన ఆధారంగా తన సోదరి మరణం అనంతరం వారు అందుబాటులో లేకపోవడమేనని కూడా చెబుతోంది.

దీంతో మరోసారి తన కూతురిది యాక్సిడెంట్ కాదు హత్య అంటూ గౌతమి తల్లి పోలీసుకు మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సమాజంలో ఆడపిల్లకు న్యాయం జరగకుండా పోతోందని ఆమె బాధతో అన్నారు. ఇంత క్షోభ భరించడం తమ వల్ల కావడం లేదని అన్నారు. ఇంత క్షోభపడడం కంటే ఆడపిల్లను పురిట్లోనే చంపుకోవడం మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే కొంత మంది పురిట్లోనే బిడ్డలను చంపుకుంటున్నారని పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News