: కేవలం అధికార పార్టీ నాయకుల పొలాలకు మాత్రమే నష్టపరిహారం ఇస్తున్నారు: వైఎస్ జగన్


కేవలం అధికార పార్టీకి చెందిన నాయకుల పొలాలను  మాత్రమే సర్వే చేసి నష్టపరిహారం ఇస్తున్నారని రైతులు చెబుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. కృష్ణా జిల్లా బాపులపాడులో వైఎస్ జగన్ ఈరోజు పర్యటించారు. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం మినుము రైతులతో ముఖాముఖిగా జగన్ మాట్లాడుతూ, ఎండిన పంట పొలాల పక్క నుంచే వెళ్లి విమానం ఎక్కే జిల్లా మంత్రి ఏనాడూ రైతుల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే కృష్ణా డెల్టాలో కరవు ఏర్పడిందని, ఏలూరు కాల్వ పుట్టిన నాటి నుంచి ఏనాడూ రైతులు ఇంతలా బాధపడలేదని విమర్శించారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో రైతులకు సాగునీరు అందించలేదని, పంట నష్టపోయిన రైతులను కనీసం అధికారులు కూడా పరామర్శించలేదని అన్నారు. మినుము పంట రైతులు తీవ్రంగా నష్టపోయారని, జిల్లాలోని మూడు వేల ఎకరాల పరిస్థితి ఇలాగే ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News