: రోడ్డుపై రక్తమోడుతున్న వ్యక్తి... ఫొటోలు తీసేందుకు ఎగబడ్డ స్థానికులు
మైసూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై రక్తమోడుతున్న ఓ వ్యక్తి వద్దకు గుంపులుగా చేరుకున్న స్థానికుల్లో కొందరు ఆయనను ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు. కళ్ల ముందు నిండు ప్రాణం పోతోంటే తమ సెల్‌ఫోన్‌లలో ఫొటోలు తీసేందుకు ఉత్సాహం చూపిన వారి పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. వివరాల్లోకి వెళితే, వేగంగా వచ్చిన ఓ పోలీసు జీపు బస్సును ఢీకొట్టంతో జీపు డ్రైవర్ మహేశ్ కుమార్(38) తలకు తీవ్ర గాయం అయింది. ఆయనను త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయని స్థానికులు ఆ ప్రమాద దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లలో బంధించారు. చివరికి ఆలస్యంగా కొందరు ఆయనను ఆసుపత్రికి తరలించిననా సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.