: చంద్రబాబుతో మాట్లాడండి: గవర్నర్ ను కోరిన కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ అధీనంలో ఉండి, ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న సచివాలయ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి వెంటనే ఇప్పించేలా చంద్రబాబునాయుడిని ఒప్పించాలని గవర్నర్ నరసింహన్ ను కేసీఆర్ కోరినట్టు తెలిసింది. ఈ ఉదయం మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా, బాపూ ఘాట్ లో ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం, రాజ్ భవన్ లో నరసింహన్ ను కేసీఆర్ కలసి చర్చించారు. ఏపీ సచివాలయం అమరావతికి తరలి వెళ్లిందని గుర్తు చేసిన ఆయన, భవనాలను స్వాధీనం చేసేలా గవర్నర్ కృషి చేయాలని కోరినట్టు తెలుస్తోంది.
విభజన అనంతర సమస్యలు ఇంకా పీడిస్తున్నాయని ఆయన చెప్పారు. కాగా, ఎల్లుండి తన సమక్షంలో తెలంగాణ, ఏపీ మంత్రుల భేటీ ఉందని గుర్తు చేసిన నరసింహన్, ఆ సమావేశంలో భవనాల అప్పగింతపై మాట్లాడదామని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, హైదరాబాద్ లో తమకు ఓ శాశ్వత భవనాన్ని అప్పగిస్తే, సచివాలయం అప్పగింతపై నిర్ణయం తీసుకోవాలన్నది చంద్రబాబు అభిప్రాయం. అందుకోసం తెలంగాణ సర్కారుతో చర్చించేందుకు ఓ కమిటీని కూడా ఆయన నియమించిన సంగతి తెలిసిందే.