: కెరీర్ చరమాంకమని తెలుసు... తిరిగొస్తానో? రానో?: ఫెదరర్ భావోద్వేగం
35 సంవత్సరాల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలుచుకుని, ఈ ఘనత సాధించిన అత్యంత వయస్కుడిగా రికార్డును సృష్టించిన రోజర్ ఫెదరర్, తన టెన్నిస్ కెరీర్ చరమాంకంలో ఉందన్న సంగతి తనకు తెలుసునని వ్యాఖ్యానించాడు. మెల్ బోర్న్ లోని రాడ్ లావర్ ఎరీనాలో, టైటిల్ అందుకున్న అనంతరం ఫెదరర్ భావోద్వేగంతో మాట్లాడాడు.
"వచ్చే సంవత్సరం ఇక్కడికి వస్తాననే అనుకుంటున్నా. రాకుంటే మాత్రం ఈ సంవత్సరం జ్ఞాపకాలు జీవితాంతం తోడుంటాయి. నాకున్న గాయాల గురించి నాకు తెలుసు. ఐదేళ్ల అనంతరం ఓ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవడం సంతోషాన్ని కలిగించింది. ఇక నాలో మిగిలివున్న టెన్నిస్ తక్కువే. మరో గాయం తగిలితే వచ్చే సంవత్సరం ఇక్కడికి రాలేకపోవచ్చు. ఏమో ఏం జరుగుతుందో. ఈ వయసులో అవకాశం దక్కించుకోవాలంటే ఎంత కష్టమో మీకూ తెలుసు. నా కెరీర్ లో ఈ సమయం చరమాంకమని తెలుసు" అని వ్యాఖ్యానించాడు. అయితే, ఇదే తన చివరి ఆస్ట్రేలియన్ ఓపెన్ అని భావించడం లేదని చెప్పాడు.