: చంద్రబాబు-లోకేశ్ దీక్ష చెయ్యాలి.. కొంచెం చోటు ఇస్తే నేనూ కూర్చుంటా: ముద్రగడ
ఆంద్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాకోసం మరోసారి ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తమవుతున్న వేళ ఆ అంశంపై కాపు ఐక్య వేదిక నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. ఈ రోజు ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం టీడీపీ యువనేత లోకేశ్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష చేపట్టాలని ఆయన అన్నారు. దీక్షలో కొంచెం చోటు ఇస్తే తాను కూడా కూర్చుంటానని ముగ్రగడ వ్యాఖ్యానించారు. తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా గతంలో జయలలిత దీక్ష చేపట్టారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం తగువు పెట్టుకుంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు ఆగిపోతుందని ప్రశ్నించిన ముద్రగడ.. ఆ ప్రాజెక్టు విభజన చట్టంలోని అంశమే కదా? అని అడిగారు. రాష్ట్రంలో ఉద్యమాలను అణచివేస్తున్నారని, తాము కాపు రిజర్వేషన్లను సాధించి తీరుతామని ఆయన అన్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన తుని ఘటనలో తన ప్రమేయం ఉంటే తాను విచారణకు సిద్ధమని ఆయన అన్నారు.