: డొనాల్డ్ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో సంబరాల్లో మునిగితేలుతున్న ఉగ్రవాదులు


ముస్లిం దేశాల నుంచి వచ్చే శరణార్థులతో పాటు ఇస్లామిక్‌ ఉగ్రవాదులు త‌మ దేశంలోకి ప్ర‌వేశించ‌కుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవ‌లే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేసి ముస్లిం మెజార్టీ దేశాల నుంచి అమెరికాకు వలసలు తగ్గించేందుకు చ‌ర్య‌లు ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అయితే, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై ఐఎస్ఐఎస్ తో పాటు పలు జిహాదీ గ్రూపులు పండుగ చేసుకుంటున్నాయి. ట్రంప్ నుంచి ఆ నిర్ణయం వెలువడడ‌మే ఆల‌స్యం, విజయోత్సవాలు జరుపుకున్నాయి. అంతేకాదు, ముస్లింలు ఒక్కతాటికి వచ్చేలా చేసిన గొప్ప వ్యక్తి ట్రంప్ అంటూ పొగుడుతున్నాయి. ఈ విష‌యం ఐసిస్‌ అధికారిక వార్తాపత్రిక, అనధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది.

అమెరికా అధ్య‌క్షుడి తీరు అమెరికాకు విదేశాల నుంచి వచ్చే ముస్లింలు, అమెరికాలోనే పుట్టిపెరిగిన ముస్లింలను కూడా ఒత్తిడికి గురిచేస్తుందని ఐఎస్ఐఎస్‌ పేర్కొంది. దీంతో వారు జిహాదీలకు మద్దతుపలుకుతారని తెలిపింది. ట్రంప్‌ త్వరలోనే మధ్యప్రాచ్య (మిడిల్‌ ఈస్ట్‌) దేశాలపై యుద్ధానికి దిగుతారని పేర్కొంది. సిరియా కేంద్రంగా నడుస్తోన్న ఈ వెబ్‌సైట్‌లో ఐఎస్ఐఎస్ గురించి వచ్చే వార్తలను అమెరికా రక్షణశాఖ కూడా ప్రామాణికంగా తీసుకుంటుంది. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అనంత‌రం ఇక ఐఎస్ఐఎస్‌ చీఫ్‌ అబూ బకర్‌ అల్‌ బాగ్ధాదీ దాక్కోవాల్సిన అవసరం లేదని ఆ ఉగ్ర సంస్థ‌ పేర్కొంది. ఇక‌పై ఆయ‌న‌ ధైర్యంగా బయటికి రావాల‌ని పేర్కొంది.

అమెరికాతో పాటు యూరప్‌ దేశాలపై దాడులు చేయాలనే తమ లక్ష్యం ట్రంప్ నిర్ణ‌యంతో ఇంకాస్త సుల‌భం కానుందని అందులో తెలిపారు. ఆ వెబ్‌సైట్‌ల‌లో పేర్కొన్న ఈ అంశాల‌తో అమెరికాకే చెందిన మాజీ అధికారులు కూడా ఏకీభవించారు. ట్రంప్ నిర్ణ‌యం వ్యూహాత్మక తప్పిదమని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News