: యెమన్‌లో అమెరికా దాడులు.. 41 మంది ఉగ్రవాదులు హతం
యెమన్‌లో అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో మొత్తం 57 మంది మృతి చెందారు. వీరిలో 41 మంది అనుమానిత అల్‌ఖాయిదా ఉగ్రవాదులు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమెరికా బలగాలు జరిపిన తొలి దాడి ఇదే. బైదా సంట్రెల్ ప్రావిన్స్‌లోని యక్లా జిల్లాలో అమెరికా దళాలు జరిపిన దాడుల్లో 8 మంది మహిళలు, ఎనిమిది మంది చిన్నారులు సహా మొత్తం 57 మంది హతమైనట్టు యెమన్ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మృతి చెందిన వారిలో 41 మంది ఉగ్రవాదులని తెలిపాయి. అల్‌ఖాయిదా నిర్వహిస్తున్న స్కూళ్లు, మసీదులు, వైద్య ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్టు పేర్కొన్నాయి. దాడుల్లో అల్‌ఖాయిదా ప్రాంత చీఫ్ అబు బరాజన్ కూడా మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. తమ సైనికుడు కూడా ఒకరు మృతి చెందినట్టు అమెరికా పేర్కొంది. గత 24 గంటల్లో వంద మంది రెబల్స్‌ను మట్టుబెట్టినట్టు యెమన్ ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.