: రైల్వే టికెట్‌లో రాయితీ కావాలా?.. అయితే 'ఆధార్' వివరాలివ్వాల్సిందే!
రైల్వే టికెట్ల రాయితీల విషయంలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకునేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. వృద్ధులు, జర్నలిస్ట్‌లు, క్రీడాకారులు, విద్యార్థులు.. ఇలా పలువురికి రైల్వేశాఖ రాయితీలు అందిస్తోంది. ఇటువంటి రాయితీలు దాదాపు 50 వరకు ఉన్నాయి. అయితే వీటి అమలులో అక్రమాలు జరుగుతుండడంతోపాటు ఏడాదికి రూ.1600 కోట్ల వరకు ప్రభుత్వంపై భారం పడుతోంది. దీంతో అక్రమాలకు పుల్‌స్టాప్ పెట్టాలని భావించిన ప్రభుత్వం ఇకపై టికెట్‌లో రాయితీ పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ నంబరు వెల్లడించాలనే నిబంధనను తీసుకురావాలని యోచిస్తోంది. టికెట్ తీసుకునే సమయంలో ఆధార్ వివరాలు చెప్పడంతోపాటు రైలులో తనిఖీ అధికారికి ఆధార్‌కార్డును విధిగా చూపించాల్సి ఉంటుంది.