: కేజ్రీవాల్ పై కేసు నమోదు చేసి, ఎల్లుండిలోగా ఎఫ్‌ఐఆర్ కాపీ అందజేయండి!: ఈసీ ఆదేశం
గోవా ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించి, హెచ్చరికలు ఖాతరు చేయకపోవడంపై మండిపడింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఈసీ ఆయనపై చట్టపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ పై కేసు నమోదు చేసి, ఆ ఎఫ్‌ఐఆర్ కాపీని జనవరి 31 (మంగళవారం) సాయంత్రం 3 గంటల్లోగా తమకు పంపాలని అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది.
గోవా ఎన్నికల ప్రచారంలో జనవరి 8న ఆయన మాట్లాడుతూ, ప్రత్యర్థి పార్టీలు డబ్బులిస్తే తీసుకోండి, కానీ ఓటు మాత్రం ఆప్ కే వేయండి అని ఆయన సూచించారు. గతంలో ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇవే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై 19న వివరణ ఇవ్వాలని కోరినా ఆయన బేఖాతరు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ ఆయనపై కేసుకు ఆదేశాలు జారీ చేసింది.