: నేడు వైకాపా తీర్థం పుచ్చుకోనున్న కోటగిరి


మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్ నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నేడు పార్టీ అధినేత వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనుండగా, సాయంత్రం 4 గంటలకు ద్వారకా తిరుమలలో జరిగే భారీ బహిరంగ సభలో శ్రీధర్ వైకాపా తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ మాజీ నేత ఎంఆర్డీ బలరామ్ సహా పలువురు నేతలు వైకాపాలో చేరనున్నారు. వీరందరినీ స్వయంగా జగన్ పార్టీలోకి ఆహ్వానిస్తారని వైకాపా వర్గాలు వెల్లడించాయి.

కాగా, శ్రీధర్ గత ఆదివారం నాడు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ తో సమావేశమై, పార్టీలో చేరికపై చర్చించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల ఫిరాయింపులతో ఇబ్బందులు పడ్డ వైకాపాలోకి ఇప్పుడిప్పుడే చేరికలు మొదలు కావడం పార్టీ నేతలకు ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇటీవల మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కాసు కృష్ణా రెడ్డి కుమారుడు కాసు మహేష్ రెడ్డి వైకాపాలో చేరడం తెలిసిందే. మహేష్ చేరికతో నరసరావుపేట ప్రాంతంలో పార్టీ మరింత బలోపేతమైందని జగన్ స్వయంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Loading...

More Telugu News