: చివరి మెట్టుపై బోల్తా పడ్డ సానియా మీర్జా జోడి... ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఓటమి
ఈ సంవత్సరం తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలుచుకుని సీజన్ లో శుభారంభం చేయాలని భావించిన సానియా మీర్జాకు చుక్కెదురైంది. క్రొయేషియాకు చెందిన ఇవాన్ డోడిగ్ తో కలసి ఫైనల్ వరకూ చేరిన సానియా, తుది మెట్టుపై బోల్తా పడింది. రాడ్ లవర్ ఎరీనా మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అమెరికాకు చెందిన అబిగాలి స్పియర్స్, జువాన్ సెబాస్టియన్ కబాల్ జోడీ చేతిలో 6-2, 6-4 తేడాతో సానియా జోడీ ఓటమి పాలైంది. తొలి సెట్ ను సులువుగా గెలుచుకున్న స్పియర్స్ జోడీ, రెండో సెట్ లో మాత్రం సానియా జోడి నుంచి కొంత ప్రతిఘటనను ఎదుర్కొంది. అయినప్పటికీ పట్టు కోల్పోక, బ్రేక్ పాయింట్ సాధించడం ద్వారా ఆధిక్యంలోకి వెళ్లి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను ఖాతాలో వేసుకుంది. టాప్-2 జోడీగా బరిలోకి దిగి ఫైనల్ వరకూ వచ్చి, అన్ సీడెడ్ల చేతిలో సానియా జోడీ ఓడిపోవడం గమనార్హం.