: ట్రంప్ కు, సిలికాన్ వ్యాలీకీ మధ్య 'అమెరికా ఫస్ట్' అడ్డుగోడ!
'అమెరికా ఫస్ట్' అన్న కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నినాదం సిలికాన్ వ్యాలీకీ ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టేలా ఉన్నాయని దిగ్గజ కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తో పాటు, గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్ సైతం ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను విమర్శించారు.
"మీలో చాలా మంది లాగానే, నేను కూడా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఆదేశాలపై విచారం వ్యక్తం చేస్తున్నా. దేశాన్ని సురక్షితంగా ఉంచాల్సిందే. అందుకోసం నిజమైన విపత్తు ఎవరి నుంచి సంభవిస్తుందో తెలుసుకుని ఆ దిశగా దృష్టిని సారించాలి. ఇదే సమయంలో రక్షణ, సహాయం కోరి వస్తున్న వారిని అక్కున చేర్చుకోవాలి" అని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. ట్రంప్ ఆదేశాలతో దాదాపు 100 మందికి పైగా గూగుల్ ఉద్యోగులను తొలగించాల్సి రావచ్చని సుందర్ పిచాయ్ అన్నారు. ఈ మేరకు ఉద్యోగులకు లేఖను రాస్తూ, ట్రంప్ ఆదేశాలు తనను బాధించాయని తెలిపారు.
అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలకు, ట్రంప్ ప్రభుత్వానికి మధ్య అడ్డుగోడ ఏర్పడిందని చెప్పడానికి జుకర్ బర్గ్, సుందర్ పిచాయ్ ల వ్యాఖ్యలు చాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కంపెనీల్లో విదేశాల నుంచి వచ్చిన టెక్ నిపుణులు ఎంతోమంది విధులను నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి గ్రీన్ కార్డు, వీసాలు ఉన్నప్పటికీ, పలువురిని విమానాలు ఎక్కకుండా అధికారులు అడ్డుకుంటున్నారని 'న్యూయార్క్ డైలీ న్యూస్' వెల్లడించింది. తమకు అందిన ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నామని కస్టమ్స్ అండ్ బార్డర్ కంట్రోల్ ఏజన్సీ అధికారులు చెబుతుండటం గమనార్హం.
ఇక వివిధ దేశాల్లో కంపెనీ పనుల నిమిత్తం వెళ్లిన గూగుల్ ఉద్యోగులు, కొత్త ఆదేశాలు పూర్తి స్థాయిలో అమల్లోకి రాకముందే వచ్చేయాలని సుందర్ పిచాయ్ ఆదేశించారు. వీరికి ఏదైనా సహాయం కావాలంటే గూగుల్ సెక్యూరిటీ, ట్రావెల్, ఇమిగ్రేషన్ టీములను సంప్రదించాలని ఆయన సూచించారు. ఇక ట్రంప్ నిషేధం విధించిన ఏడు ముస్లిం దేశాలకు చెందిన ఎంతో మందికి ఇప్పటికే గ్రీన్ కార్డులు, హెచ్-1బీ వీసాలు ఉండగా, వీరిలో పలువురు అమెరికా బయట ఇప్పుడు ఉన్నారు. వీరు తిరిగి అమెరికాలోకి ప్రవేశించే విషయంలో స్పష్టత లేదు. పరిస్థితి చెయ్యి దాటకముందే ట్రంప్ తన ఆదేశాలను సవరించుకోవాలని, లేకుంటే తాము, తమతో పాటు అమెరికా నష్టపోవాల్సి వుంటుందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.