: ట్రంప్ 'గోడ' నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇరాన్.. ఇది కూల్చే సమయమనీ, కట్టే సమయం మాత్రం కాదనీ అంటున్న హసన్ రొహాని
అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తొలి రోజు నుంచి దూకుడుగానే వెళ్తున్నారు. మెక్సికో నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వలసలను అడ్డుకునేందుకు అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ కడతానని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన ట్రంప్ అనుకున్నట్టుగానే ఇందుకు సంబంధించిన ఆదేశాలపై సంతకాలు కూడా చేశారు. అయితే సరిహద్దులో గోడ నిర్మించాలన్న ట్రంప్ ఆలోచనను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది దేశాల మధ్య గోడ కట్టే సమయం కాదని అధ్యక్షుడు హసన్ రొహాని అన్నారు. టెహ్రాన్‌లో జరిగిన పర్యాటక సదస్సులో మాట్లాడిన ఆయన ట్రంప్ నిర్ణయాన్ని ఖండించారు. కొన్నేళ్ల క్రితం బెర్లిన్ గోడను ప్రజలు కూల్చేసిన విషయం ట్రంప్ మర్చిపోయినట్టు ఉన్నారని అన్నారు. ఇది గోడలు కట్టే సమయం కాదని, కూల్చే సమయమని పేర్కొన్నారు.