: కలలో కూడా అటువంటి సీన్ ను చూపించడం లేదు... దాడితో ఎంతో బాధ కలిగిందన్న సంజయ్ లీలా భన్సాలీ
తాను నిర్మిస్తున్న పద్మావతి చిత్రంలో, రాణి పద్మావతికి, అల్లాఉద్దీన్ ఖల్జీకి మధ్య ఎలాంటి శారీరక సంబంధం ఉన్నట్టు చూపించే దృశ్యాలు లేవని, ఆ రెండు పాత్రల నడుమ డ్రీమ్ సీన్స్ కూడా లేవని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ స్పష్టం చేశారు. తాము ఎంతో రీసెర్చ్ చేసి ఈ చిత్రాన్ని తీస్తున్నామని, రణవీర్ కపూర్, దీపిక పాత్రల మధ్య సన్నిహిత సన్నివేశాలుండవని ఆయన అన్నారు. జైగఢ్ కోటలో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా, రాజ్ పుత్ కర్ణి సేన కార్యకర్తలు దాడి చేసి బన్సాలీపై చెయ్యి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆపై షూటింగ్ ను నిలిపివేసిన బన్సాలీ, మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.
తాను జైపూర్ లో రెండు సినిమాలు చేశానని, నగరంపై తనకున్న మంచి అభిప్రాయం ఈ ఘటనతో పోయిందని అన్నారు. అందమైన జైపూర్ నగరానికి ఉన్న పేరును చెడగొట్టే ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో జరగకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. చిత్ర సిబ్బంది రక్షణ కోసమే షూటింగ్ ను ఆపినట్టు తెలిపారు. ఈ చిత్రం జైపూర్ స్థానికులు గర్వపడేలా ఉంటుందని తాను నమ్మకంగా చెప్పగలనని అన్నారు. తాము సమాచారం ఇవ్వగానే వెంటనే స్పందించి తమను రక్షించిన జైపూర్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.