: వచ్చిన వారిని వచ్చినట్టు విమానాశ్రయాల్లోనే అరెస్ట్ చేస్తున్న యూఎస్ పోలీసులు
అమెరికాలో కాలుమోపుతున్న ముస్లిం వలసవాదులను వచ్చిన వారిని వచ్చినట్టే అరెస్ట్ చేస్తున్నారు. ముస్లింల రాకను నిషేధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకు వచ్చిన తరువాత పోలీసుల అరెస్టులు ప్రారంభమయ్యాయి. ఇరాక్ నుంచి వచ్చిన ఇద్దరిని న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేయడంతో, వారు ట్రంప్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, తాము ఎన్నోమార్లు అమెరికాకు వచ్చి వెళ్లామని కోర్టులో కేసు వేశారు. తమవంటి ఎంతో మందిని అరెస్ట్ చేసి జైళ్లకు పంపుతున్నారని వారు వాపోయారు. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో సైతం ఇదే పరిస్థితి. దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టుల్లో ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారన్న లెక్కలు స్పష్టంగా తెలియడం లేదు. కాగా, 120 రోజుల పాటు వలసవాదుల రాకను పూర్తిగా అడ్డుకోవాలని, అమెరికాలో ప్రవేశం పొందగోరే వారి కోసం కొత్త విధానాన్ని తయారు చేయాలని ట్రంప్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.