: ట్రంప్ 'ముస్లిం నిషేధం'పై నిప్పులు చెరిగిన ఇరాన్
తమ దేశంలోకి ముస్లింల ప్రవేశాన్ని అడ్డుకుంటూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పలు దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. ఐకమత్యంగా, సన్నిహితంగా, శాంతియుతంగా కలసి ఉండాల్సిన సమయంలో ఇటువంటి అడ్డుగోడలు సరికాదని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ వ్యాఖ్యానించారు. దేశాల మధ్య దూరం పెంచేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తనను కలచివేసిందని తెలిపారు. ఇది గోడలు కట్టే సమయం కాదని, బెర్లిన్ గోడ ఎన్నో ఏళ్ల క్రితమే కూలిపోయిందన్న సంగతిని ట్రంప్ మరచిపోయాడని విమర్శించారు.
కాగా, ట్రంప్ కడుతున్న గోడలు కూడా కూలిపోయే సమయం వస్తుందని టర్కీ ప్రధానమంత్రి బినాలీ ఇల్దిరిమ్ వ్యాఖ్యానించారు. ప్రాంతీయ సమస్యలను తివాచీ కింద దాచడం ద్వారా వాటిని పరిష్కరించలేమని, ఎవరైనా మార్పునకు అనుగుణంగా పయనించాల్సిందేనని అన్నారు.