: తొలి టీ20లో ఓటమికి కారణాలివే...మరి మలి మ్యాచ్ లో ఎలా ఆడుతారో?


కాన్పూర్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ లో వైఫల్యం.. బౌలింగ్ లో ధారాళంగా పరుగులివ్వడంతో భారత జట్టు ఓటమిపాలైంది. టీమిండియాకు ఓపెనర్ గా కోహ్లీ రావడం జట్టును ఇబ్బందుల్లో పడేసింది. ఇన్నింగ్స్ ను ఆరంభించడంతో కోహ్లీ పిచ్ ను అర్థం చేసుకునేందుకు సమయం పట్టింది. దీంతో కోహ్లీ తొలి టీ20లో విఫలమయ్యాడు. కేఎల్ రాహుల్ టీ20 ఫార్మాట్ కు ఇంకా అలవాటు పడకపోవడంతో దారుణంగా విఫలమయ్యాడు. యువీ కూడా తొందరగానే పెవిలియన్ చేరాడు. సురేష్ రైనా మాత్రమే జట్టులో కాస్త ఫర్వాలేదనిపించాడు. వేగంగా పరుగులు సాధిస్తూ ఆకట్టుకున్నాడు. ధోనీ స్థాయికి తగ్గట్టు ఆడకపోయినా, ఆకట్టుకున్నాడు. టాప్ స్కోరర్ గా నిలిచినా మెరుపుల్లేకపోవడంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.

ఇంగ్లండ్ బౌలర్లు భారత బ్యాట్స్ మన్ ను సమర్థవంతంగా కట్టడి చేశారు. కోహ్లీ, యువరాజ్, రైనా, రాహుల్ లను అవుట్ చేసిన తీరు చూస్తే, టీ20ల్లో భారత్ ను ఓడించేందుకు ఎంత పక్కాగా ప్రణాళిక రచించారన్నది అర్థమవుతుంది. భారత బౌలింగ్ లో వాడి లోపించింది. సీనియర్ బౌలర్ అయిన ఆశిష్ నెహ్ర ధారాళంగా పరుగులిచ్చాడు. కొత్త కుర్రాడు పర్వేజ్ రసూల్ ఎలాంటి ప్రభావం చూపలేదు. చాహల్ ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. దీంతో టీమిండియా ఓటమిపాలైంది. రెండో టీ20 రేపు నాగ్ పూర్ లో జరగనుంది. ఈ పిచ్ పై ఆడిన మ్యాచ్ లలో భారత్ ప్రతికూల ఫలితాలనే చవిచూడడం అభిమానుల్లో ఆందోళన రేపుతోంది. రేపు భువనేశ్వర్ కుమార్ తోపాటు రసూల్ స్థానంలో అమిత్ మిశ్రా జట్టులోకి రానుండడం ఆసక్తి రేపుతోంది. 

  • Loading...

More Telugu News