: పద్మావతి అనే రాణి చరిత్రలోనే లేదు: చరిత్ర కారుడు ఎస్.ఇర్ఫాన్ హబీబ్
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న 'పద్మావతి' చిత్రం వివాదాస్పదం అయిన సంగతి విదితమే. పద్మావతి పాత్ర చిత్రీకరణ వ్యవహారం రాజస్థాన్ రాజ్ పుత్ లకు ఆగ్రహాన్ని తెప్పించింది. దీనిపై ప్రముఖ చరిత్రకారుడు ఎస్.ఇర్ఫాన్ హబీబ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. అసలు చరిత్రలో పద్మావతి అనే రాణి లేదని ఆయన బాంబు పేల్చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... 1303 కాలంలో చిత్తోర్ గఢ్ కోటలో అల్లావుద్దీన్ ఖిల్జి అద్దంలో చూసి ఇష్టపడిన రాణి పద్మావతిని వశపరుచుకోవడానికి ఆమె భర్త రాజా రావల్ రతన్ సింగ్ కోటను స్వాధీనం చేసుకుంటాడనేది సంజయ్ లీలా భన్సాలీ, రాజ్ పుత్ కర్ణి సేనల వాదన, వాస్తవానికి రాణి పద్మావతి అసలు చరిత్రలోనే లేదు.
1540 లో మాలిక్ మహమ్మద్ జాయసి అనే కవి ‘పద్మావత్’ అన్న కావ్యంలో పద్మావతి అనే పాత్రని కల్పించారు అని హబీబ్ స్పష్టం చేశారు. కావ్యాల వల్ల ఉనికిలోకి వచ్చిన రాణి కేవలం రాణి పద్మావతి మాత్రమే కాదని, ‘మొఘల్ ఎ ఆజం’ లో చూపించిన అనార్కలి కూడా కావ్యనాయకేనని ఆయన తెలిపారు. ఇది చారిత్రకంగా రుజువైన అంశమని ఆయన తెలిపారు. మరి దీనిపై సంజయ్, రాజ్ పుత్ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.