: మోర్గాన్ చతురత ముందు కోహ్లీ దూకుడు పారుతుందా?


ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చతురత ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడు మంత్రం పని చేస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇయాన్ మోర్గాన్ భారత్ పిచ్ లను సరిగ్గా అర్ధం చేసుకున్నాడు. దీంతో టెస్టు, వన్డే సిరీస్ ల ఓటమికి టీ20 సిరీస్ ను గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తొలి టీ20 మ్యాచ్ లో ఇయాన్ మోర్గాన్ సరైన వ్యూహం రచించి భారత ఆటగాళ్లను వైడ్ బౌన్సర్లతో రెచ్చగొట్టి, యార్కర్ల ఉచ్చులో బంధించాడు. దీంతో ఊహించని బంతులను ఎదుర్కోవడంలో తడబడ్డ టీమిండియా ఓటమిపాలైంది. దీంతో మరోసారి కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసే ప్రయత్నంలో మోర్గాన్ ఉంటాడు. ఎందుకంటే, వైడ్ బౌన్సర్లు ఆడడంలో కోహ్లీ బలహీనత పలు సందర్భాల్లో బయటపడింది. అలా వచ్చిన బంతిని బౌండరీ లైన్ దాటించే ప్రయత్నంలో కోహ్లీ పలు మార్లు బోల్తా పడ్డాడు.

కీపర్ లేదా ఫస్ట్ స్లిప్ కు అడ్డంగా దొరికేశాడు. అలాంటి బంతులను ఆడే బలహీనత టీమిండియాలో చాలా మంది ఆటగాళ్లకు ఉందని గుర్తించిన మోర్గాన్ అలాంటి బంతులు సంధించమని ఆటగాళ్లకు సూచించే అవకాశం ఉంది. అలాగే వికెట్ల ముందుకు వచ్చి బ్యాటింగ్ చేసే రైనాను యార్కర్లతో కట్టడి చేశాడు. మరోసారి అదే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. ఎలాంటి బంతినైనా అవలీలగా బౌండరీ లైన్ దాటించగలిగే యువరాజ్ ను కట్టుదిట్టమైన ఫీల్డింగ్ తో బోల్తా కొట్టించాడు. ఇక ధోనీని ఆపడం సవాలే అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు. టీమిండియా ఓపెనర్లు పూర్తిగా విఫలమయ్యారు. కొత్త కుర్రాళ్లు ఇంకా కుదురుకోలేదు. దీంతో ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించడం ద్వారా తమ ఆధిక్యతను ప్రదర్శించాలని మోర్గాన్ వ్యూహాలు రచిస్తున్నాడు. ఇదే సమయంలో కేవలం దూకుడునే బలంగా నమ్ముకున్న కోహ్లీ మోర్గాన్ వ్యూహాలను ఏమేరకు అడ్డుకుంటాడన్నది ఆసక్తి రేపుతోంది. 

  • Loading...

More Telugu News