: మార్పు రావాలంటే ప్రజల ఆలోచన తీరు మారాలి: హైదరాబాద్ లో వెంకయ్య నాయుడు
దేశంలో మార్పు రావాలంటే ప్రజల ఆలోచన తీరు మారాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... స్వచ్ఛభారత్‌తోనే దేశంలో మార్పు మొదలైందని చెప్పారు. ప్రజల ఆలోచన తీరులో మార్పులేకపోతే ప్రభుత్వం తీసుకొస్తోన్న పథకాలు సఫలం కావని అన్నారు. అభివృద్ధి సాధించాలంటే డబ్బు రెండో అంశం అని, మనలో మార్పు రావడం అనేది మొదటి అంశం అని వెంకయ్య చెప్పారు. ఎల్‌పీజీ సిలిండర్ గ్యాస్ అందరికీ ఇస్తున్నారని, అయితే వారికి సబ్సిడీ ఉందని కూడా తెలియకపోయేదని అన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో దేశంలో కోటి 40లక్షల మంది స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకున్నారని తెలిపారు. దేశ ప్రజల ఆలోచనా ధోరణిలో మోదీ మార్పు తీసుకొస్తున్నారనడానికి ఇదో ఉదాహరణ అని ఆయన చెప్పారు.