: అప్పట్లో రూ.2 వేలు ఉన్న వేతనం ఇప్పుడు రూ.2.5 లక్షలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరుగుతూనే ఉన్న వేతనాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరుగుతూనే ఉన్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వారి వేతనాలు గణనీయంగా పెరుగుతున్నట్టు తాజా నివేదిక పేర్కొంది. కేంద్రం ప్రతి పదేళ్లకు ఓసారి నియమిస్తున్న కేంద్ర వేతన సంఘం(సీపీసీ) సిఫారుసుల ఆధారంగా ప్రభుత్వం వేతనాలను పెంచుతూనే ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన ప్రారంభంలో 55 రూపాయల వేతనం అందుకున్న సాధారణ ఉద్యోగి వేతనం ప్రస్తుతం రూ.18 వేలకు చేరుకుంది. అలాగే అప్పట్లో రూ.2 వేలు వేతనం అందుకున్న సీనియర్ అధికారి జీతం ఇప్పుడు రూ.2.5 లక్షలకు చేరుకుంది. అంటే ఇన్నేళ్లలో మొత్తం 32,727 శాతం పెరిగినట్టు నివేదిక పేర్కొంది.
కాగా ప్రస్తుతం 7వ వేతన సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా మూలవేతనంలో 14.27 శాతం పెంచారు. తొలి వేతన సంఘం చేసిన సిఫారుసుల ఆధారంగా 1957లో కనీస వేతనాన్ని రూ.80 గా పెంచగా, గరిష్టంగా రూ.3 వేలు పెంచారు. ఆరో వేతన సంఘం ప్రతిపాదనలతో కనీస వేతనం రూ.7వేలకు, సీనియర్ అధికారి వేతనం గరిష్టంగా రూ.90 వేలకు చేరింది. తాజాగా ఏడో వేతన సంఘం ప్రతిపాదనలతో కనీస వేతనం రూ.18 వేలు, గరిష్ట వేతనం రూ.2.5 లక్షలకు చేరుకుంది. అంటే స్వాతంత్ర్యం వచ్చిన 68 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వంలోని సాధారణ ఉద్యోగుల వేతనాలు 32.727 శాతం పెరగ్గా పెద్దస్థాయి ఉద్యోగులు, అధికారుల వేతనాలు 12,500 శాతం పెరిగాయి.