: సినిమాకి, రెస్టారెంట్‌కు వెళ్లాలనుకుంటున్నారా? ఓసారి ఆలోచించండి... బిల్లు మోతెక్కిపోద్ది!
వారాంతాల్లో సినిమాలకు, అటునుంచి అటే రెస్టారెంట్‌కు వెళ్లాలనుకునే వారు ఇక మనసు మార్చుకోక తప్పదేమో. ఎందుకంటే తాజాగా ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో వీటిపై సేవాపన్ను మరింత పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ తర్వాత మల్టీప్లెక్సుల్లో సినిమా, రెస్టారెంట్లలో ఆహారం, విమాన ప్రయాణాలు తదితరాలు మరింత ఖరీదయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం రెండు సెస్ లతో కలిపి 15 శాతం వరకు ఉన్న సేవా పన్నుకు అదనంగా ఒకశాతం పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ పన్ను పెంచడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చనేది ప్రభుత్వ ఆలోచనగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. 2015-16లో సేవా పన్నును ఒకసారి ప్రభుత్వం సవరించింది. అప్పట్లో 12.36 గా ఉన్న పన్నును 14 శాతం చేసింది. ఆ తర్వాత దానికి 0.5 శాతం స్వచ్ఛభారత్ సెస్ కలిపింది. అనంతరం 2016-17లో కృషి కల్యాణ్ సెస్ పేరుతో మళ్లీ 0.5 శాతం కలిపింది. దీంతో అది 15 శాతానికి చేరుకుంది. ఇప్పుడు దానికి మరొక శాతం కలిపి సేవాపన్నును 16 శాతం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.